అరోజు అన్ని సర్వీసులు బంద్‌: కేరళ సీఎం

తిరువనంతపురం: ప్రధాన నరేంద్ర మోదీ పిలుపు మేరకు కేరళ ప్రభుత్వం ‘జనతా కర్ఫ్యూ’ను తప్పక పాటిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర రవాణా కార్పొరేషన్‌ బస్సులు రోడ్ల మీదకు రావని.. ఇతర ప్రజా రవాణా వ్యవస్థను కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా మెట్రో సర్వీసులు కూడా ఆరోజు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రజలు కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని ఈ సందర్భంగా సీఎం విజయన్‌ పిలుపునిచ్చారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తద్వారా కరోనాపై పోరులో దేశ ప్రజల నిబద్ధతను చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి ప్రబలుతున్న వేళ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, విమానయాన, మీడియా సిబ్బందికి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలపాలని కోరారు. (కరోనా: ప్రధానికి ఒడిశా సీఎం లేఖ)